: అమ్మ నన్ను నియమించమన్నారు.. చిన్నమ్మ నన్ను నియమించారు: వెనక్కి తగ్గిన దినకరన్ ఆసక్తికర వ్యాఖ్యలు
నన్ను, చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి బహిష్కరించేంత ధైర్యం వచ్చిందా? అప్పుడే కొమ్ములు మొలిచాయా? అంటూ అన్నాడీఎంకే నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆపార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్... స్వరం మార్చారు. చెన్నైలోని ఎగ్మూరులో ఫెరా కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ నుంచి ఏమీ ఆశించడం లేదని అన్నారు. తనను అన్నాడీఎంకే పార్టీలోకి తీసుకురావాలని దివంగత జయలలితే శశికళకు చెప్పారని... అందుకే పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో శశికళ తనను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను శశికళ మాత్రమే తొలగించగలరని చెప్పారు. పార్టీ నిర్ణయాలను తాను గౌరవిస్తానని, పార్టీ కోసం పని చేస్తానని ఆయన తెలిపారు. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వేరుపడలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి మేలు చేసే నిర్ణయాలకు సహకరిస్తానని ఆయన తెలిపారు. పార్టీ నుంచి తాము విడిపోలేదని ఆయన తెలిపారు.