: బాబ్రీ కేసు నుంచి కల్యాణ్ సింగ్ కు మాత్రమే ఊరట... ఎందుకంటే!
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 12 మందిపై కుట్ర పూరిత అభియోగాల నమోదుకు ఆదేశించిన సుప్రీంకోర్టు బీజేపీ నేత కల్యాణ్ సింగ్ కు మాత్రం ఊరటనిచ్చింది. ఈ కేసులో ఆయనపైనా ఆరోపణలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం కల్యాణ్ సింగ్ రాజ్యాంగ రక్షణ ఉన్న గవర్నర్ పదవిలో ఉన్నందున ఆయనపై ఎటువంటి విచారణకూ ఆదేశించలేమని స్పష్టం చేసింది. గవర్నర్ పదవిని వీడిన తరువాత ఆయనపై విచారణ చేయవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతం కల్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ కేసును రాయ్ బరేలీ కోర్టు నుంచి లక్నో కోర్టుకు బదిలీ చేస్తూ, కేసు విచారణ ముగిసే వరకూ న్యాయమూర్తులను బదిలీ చేయవద్దని ఆదేశించింది, నిందితుల్లో పలువురు ఇప్పటికే మరణించినందున ఇకపై రోజువారీ విచారణ చేపట్టి సత్వరమే తీర్పు ఇచ్చేందుకు ప్రయత్నించాలని సూచించింది. అద్వానీకి వ్యతిరేకంగా ఉన్న అభియోగాలను తొలగించేందుకు నిరాకరించిన ధర్మాసనం, ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కేసు 25 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండటం న్యాయ నిరాకరణతో సమానమేనని ధర్మాసనం పేర్కొనడం గమనార్హం.