: శశికళ వెంట 20 మంది ఉంటే పళని సర్కారు పతనమే!


తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం రాజీనామా చేసి, ఆపై తిరుగుబాటు చేసిన వేళ నడిచిన క్యాంపు రాజకీయాల్లో శశికళ వెంట 122 మంది ఎమ్మెల్యేలు కువత్తూరు రిసార్టులో ఉండి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శశికళ జైలుకు వెళ్లడం, ఆమె వర్గం నేతలపై ఐటీ దాడులు, దినకరన్ కేసుల్లో చిక్కుకోవడంతో పార్టీ నుంచి ఆమెనే గెంటివేశారు. ఇక పార్టీపై పట్టు చూపించి, ఓ దశలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని భావించిన శశికళ వెంట వాస్తవంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు? ఆమెతో ఎందరు నడవనున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం నేటి మధ్యాహ్నం తెలుస్తుంది.

ఇప్పటికే చిక్కుల్లో పడ్డ దినకరన్, నేడు 3 గంటలకు ఓ సమావేశం ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేలందరినీ హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అత్యధిక శాతం ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి వచ్చే అవకాశాలు లేకపోయినా, ఆయన వెంట... అంటే శశికళకు నిజమైన విధేయులుగా ఉన్న వారు ఎంతమంది అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పటికే 10 మంది శాసనసభ్యులు దినకరన్ వెంట ఉన్నట్టు తెలుస్తుండగా,  వారంతా చివరి వరకూ దినకరన్ వెంట ఉన్నా, ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. ఇదే సమయంలో పన్నీర్ వర్గం పళనిస్వామికి మద్దతిస్తుందని భావించినా, మరో 10 మంది దినకరన్ వర్గంలోకి వస్తే మాత్రం ప్రభుత్వం నిలిచే అవకాశాలే ఉండవు. క్షణక్షణానికీ మారుతున్న తమిళ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

మొత్తం 234 మంది సభ్యులు, ఓ నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి 235 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మరణంతో 234 మంది ఎమ్మెల్యేలున్నారు. అన్నాడీఎంకే (శశికళ)లో 123 మంది, అన్నాడీఎంకే (పన్నీర్ సెల్వం) 12 మంది, డీఎంకే 89, కాంగ్రెస్ 8, ఐయూఎంఎల్ నుంచి 1 సభ్యుడు  ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో దినకరన్ వెంట ఉన్న 10 మందిని తీసేస్తేనే పళనిస్వామి ప్రభుత్వం 113 మందితో మైనారిటీలో పడుతుంది. పన్నీర్ వర్గంలోని 12 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 125 మంది ఎమ్మెల్యేల బలం ఆయనకు లభిస్తుందని అనుకున్నా, శశికళ వర్గంలో కనీసం 8 మందికి పైగా చేరితే మాత్రం పరిస్థితి అదుపు తప్పినట్టే.

  • Loading...

More Telugu News