: అన్నాడీఎంకే ఆఫీసులో శశికళ ఫోటోలు మాయం... పోటాపోటీ సమావేశాలతో టెన్షన్ టెన్షన్!
నిన్న రాత్రి అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్ లను తొలగిస్తున్నట్టు ప్రకటన వెలువడగా, ఈ ఉదయం పార్టీ కార్యాలయం నుంచి శశికళ ఫోటోలు మాయం అయ్యాయి. సీఎం పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు ఉదయాన్నే వచ్చి ఆమె ఫోటోలన్నీ తొలగించారు. అన్నాడీఎంకే లో శశికళకు అత్యంత సన్నిహిత వర్గంగా పేరున్న ఎమ్మెల్యేలు మాత్రం చిన్నమ్మపై బహిష్కరణ వేటును, దినకరన్ తొలగింపును అంత తేలికగా తీసుకోలేకపోతున్నారు. వారంతా ఇప్పటికే సమావేశమయ్యారు.
మరోవైపు తమను తొలగించే అధికారం ఎవరికీ లేదని వాదిస్తున్న దినకరన్, ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశానికి నేతలను పిలిచారు. అందరు ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశానికి రావాలని ఆయన తరఫున పిలుపులు అందాయి. ఇదే సమయంలో ఓ వైపు పళనిస్వామి సైతం మంత్రులతో మరికాసేపట్లో ప్రత్యేకంగా సమావేశం కానుండగా, పన్నీర్ సెల్వం కూడా తన వర్గంతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. దీంతో పోటాపోటీ సమావేశాలతో తమిళనాడు రాజకీయ వాతావరణం ఉత్కంఠను రేపుతోంది.