: పరీక్షల్లో మంచి మార్కులొచ్చినా బైక్ కొనివ్వలేదని.. విద్యార్థి అదృశ్యం!
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నా బైక్ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఇంట్లో వారికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. హైదరాబాద్ శివారులోని కూకట్ పల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లోని ఎల్‌ఐజీలో నివసించే ఏసు కుమారుడు సుధాకర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఫస్టియర్ ఫైనల్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించాడు. 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించి సత్తా చాటాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని కోరాడు. దీనికి ఏసు నిరాకరించాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సుధాకర్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. పలుచోట్ల గాలించినా సుధాకర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధాకర్ కోసం గాలిస్తున్నారు.