: ఎస్‌బీఐ బాటలో మరిన్ని బ్యాంకులు.. చిన్న బ్యాంకుల విలీనానికి సిద్ధమవుతున్న పీఎన్‌బీ, బీవోబీ!
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) బాటలో మరిన్ని బ్యాంకులు నడుస్తున్నాయి. చిన్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు సహా భారతీయ మహిళా బ్యాంకు విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు చిన్న బ్యాంకులు ఉండడం కంటే కొన్ని పెద్ద బ్యాంకులు ఉండడమే మేలని భావిస్తున్న ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రక్షాళనలో భాగంగా తదుపరి విలీనాలపై కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఇందులో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలు విలీనం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఇది ప్రతిపాదన మాత్రమేనని, స్పష్టమైన నిర్ణయం వెలువడాల్సి ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.