: 89 కోట్ల రూపాయల జాబితా బయటకు రాగానే దినకరన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న మంత్రులు
చెన్నైలోని ఆర్కేనగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శశికళ సోదరి కుమారుడు దినకరన్ గెలుపు కోసం అన్నా డీఎంకే ‘నోట్ల కట్టలు’ వెదజల్లిన సంగతి బహిర్గతమైన అనంతరం... ఐటీ అధికారులు సోదాలు చేసే సమయంలో మంత్రి విజయభాస్కర్ నివాసంలో 89 కోట్ల రూపాయలకు సంబంధించిన ఓ చిట్టా దొరికిందని, ఆ జాబితాలో అన్నాడీఎంకేకు సంబంధించిన మంత్రులు ఎవరికి ఎంత? మొత్తం అందజేసిందన్న పూర్తి వివరాలు ఉన్నాయని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ చిట్టాలో ఒక్కో మంత్రికి ఉపఎన్నికల్లో పంచేందుకు ఐదారు కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయలు అందజేసి, పంపకాలు చేయమని ఇచ్చినట్టు ఉందన్న విషయం కూడా బహిర్గతమైంది. అంతే కాకుండా ఆ మొత్తం ఎవరెవరికి ఇచ్చారో కూడా వివరంగా ఉందని, ప్రధానంగా ఏడుగురు మంత్రుల పేర్లు ఉన్నాయని తమిళనాట వార్తలు వెలువడ్డాయి.
దీంతో వారంతా దినకరన్ వద్దకు వెళ్లి... తమకు కేవలం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, అయితే విజయభాస్కర్ జాబితాలో మాత్రం తమకు ఇచ్చిన దానికి రెట్టింపు కంటే మూడు నాలుగు రెట్లు చూపించారని విన్నవించుకున్నారు. దీంతో అందరి అనుమానాలు మంత్రి విజయభాస్కర్ వైపు మళ్లాయి. ఆయన లేదా ఆయన అనుచర బృందమే ఈ డబ్బును కాజేసి, మంత్రులకు ఇచ్చినట్లు జాబితా తయారు చేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై దినకరన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని, అయితే ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడంతో ఆ లెక్కలు మరుగున పడిపోయే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.