: వాట్సాప్‌లో భార్యకు తలాక్ చెప్పిన హైదరాబాద్ టెక్కీ!
వాట్సాప్‌లో భార్యకు తలాక్ చెప్పాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘటన. బాధితురాలి కథనం ప్రకారం.. నగరానికి చెందిన బాదర్ ఇబ్రహీంకు టోలీచౌకికి చెందిన ముదస్సిర్ అహ్మద్ ఖాన్‌తో ఫిబ్రవరి 7, 2016న వివాహమైంది. సౌదీ అరేబియాలోని సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో అహ్మద్ ఖాన్ సాఫ్ట్‌వేర్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వివాహం అనంతరం భార్యతో 20 రోజులు కాపురం చేసిన అహ్మద్ అనంతరం సౌదీ వెళ్లిపోయాడు.
తర్వాత ఆరు నెలలపాటు భార్య, అత్తమామలతో ఫోన్‌లో తరచూ టచ్‌లో ఉండేవాడు. అయితే గత సెప్టెంబరులో అకస్మాత్తుగా వాట్సాప్‌లో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పడంతో విస్తుపోవడం ఇబ్రహీం వంతు అయింది. విషయం కనుక్కునేందుకు ఆమె అత్తమామల ఇంటికి వెళ్లగా వారు ఆమెను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. తనకు ఎందుకు తలాక్ చెప్పాల్సి వచ్చిందో అడిగినా వారి నుంచి సమాధానం రాలేదని వాపోయింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే కజాత్ ఆఫీస్ నుంచి తలాక్‌నామాతోపాటు లాయర్ నోటీసు కూడా వచ్చిందని ఇబ్రహీం తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఇబ్రహీం వాపోయింది.