: స్విస్ బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించని వ్యాపారికి రెండేళ్ల జైలు శిక్ష
ఆదాయపన్ను శాఖ అధికారుల వద్ద తన స్విస్ బ్యాంక్ ఖాతా అంశాన్ని దాచిపెట్టినందుకు గానూ ఓ వ్యాపారికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. దానితో పాటు ఆయనకు కోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే, డెహ్రాడూన్‌లోని రాజ్‌పూర్ రోడ్డులో నగల దుకాణం కొనసాగిస్తోన్న రాజు వర్మ.. బ్యాంకు ఖాతాలో 2006 నాటికి రూ. 92 లక్షల మొత్తం ఉంది. ఆ విషయాన్ని ఆదాయపన్ను శాఖకు వెల్లడించకుండా, పన్ను ఎగవేతకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.
అక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) ముందు అతడిని హాజరుపర్చగా ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఇచ్చింది. తప్పుడు ప్రకటనలు తదితర నేరాలకు పాల్పడినట్లు అతడి మీద కేసు రుజువుకావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. రాజు వర్మకు స్విట్జర్లాండులో సొంత ఖాతా ఉందని, 2012 సంవత్సరంలో ఆదాయపన్ను శాఖకు ఫిర్యాదు అందింది. రాజు వర్మ తనకున్న ఆ ఖాతా వివరాల్ని అప్పటివరకు ఆదాయపన్ను శాఖ అధికారులకు వెల్లడించకపోవడంతో.. కర్జన్ రోడ్డులోని ఆయన ఇంటిపై అధికారులు 2012 మార్చి 14న సోదాలు చేసి, కేసులో సుదీర్ఘ విచారణ జరిపారు. ఆ ఖాతాకు సంబంధించిన పత్రాలను గతంలోనే స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఈ శిక్ష విషయంలో రాజు.. పై కోర్టులో అప్పీలు చేసుకోడానికి వీలుగా అతడికి కోర్టు నెల రోజుల బెయిల్ మంజూరు చేసింది.