: పంజాగుట్టలోని వై2కే రెస్టారెంట్ సీజ్.. కుళ్లిన మాంసం స్వాధీనం!
హైదరాబాద్ లోని పలు హోటళ్లలో జీహెచ్ఎంసీ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంజాగుట్ట, వనస్థలిపురంలోని పలు హోటళ్లపై జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. పంజాగుట్టలోని వై2కే రెస్టారెంట్ ను తనిఖీ చేసిన అధికారులు, అక్కడ కుళ్లిన మాంసం ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో ఆ రెస్టారెంట్ ను సీజ్ చేశారు. వనస్థలిపురంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ లో కుళ్లిన టమోటాలు, నిన్నటి అన్నం ఉండటంతో యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానాగా విధించారు. మరో హోటల్ ‘పాపడమ్స్’పై కూడా రూ.5 వేలు జరిమానాగా విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా హోటళ్లపై దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.