: ఆ గ్రామంలో ఒక్క రేషన్ కార్డుపై రెండు రోజులకి రెండు బిందెల నీరు!
కర్ణాటకలోని మాన్ గ్రామాన్ని కరవు పట్టి పీడిస్తోంది. నిత్యావసరాలకు నీరు దొరక్క ఆ గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. బెళగావిలోని ఖానాపూర్ తాలూకాలో ఉన్న మాన్లో 800 మంది ప్రజలు ఒకే ఒక బావి ద్వారా నీరు తీసుకోవాలి. ఇక అందులో నీరు అయిపోయినా, అది ఎండిపోయినా ఆ గ్రామస్థులు తీవ్ర కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో అది ఎండిపోకుండా ఆ గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం నీటిని పొదుపుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
తమ గ్రామంలో ఒక రేషన్ కార్డుపై రెండు రోజులకు ఒకసారి రెండు బిందెల నీరు మాత్రమే తీసుకోవాలని ప్రణాళిక వేసుకొని దానినే ఆచరిస్తున్నారు. నీటి కోసం సంబంధిత అధికారులకు ఎన్నో వినతులు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.