: ఏపీలో రెండే పథకాలు... ఒకటి లోకేష్, రెండోది సూట్ కేస్: భూమన
తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కేవలం నారా లోకేష్ ఒక్కరే రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. లోకేష్ సంతోషమే లోక సంతోషంగా భావిస్తున్నారా? అంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు పథకాలు నడుస్తున్నాయని... అందులో ఒకటి లోకేష్, రెండోది సూట్ కేస్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయమయిందని విమర్శించారు. టీడీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని టీడీపీ నేతలే చెబుతున్నారని అన్నారు. పీతల సుజాతను మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు.