: టీసీఎస్ ను దాటేసిన రిలయన్స్ విలువ... ఇండియాలో అతిపెద్ద కంపెనీగా నిలిపిన జియో

జియో సేవలు ప్రారంభమైన తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ క్రమంగా పెరుగుతూ రాగా, నేడు ఇండియాలో అత్యంత విలువైన కంపెనీగా ఉన్న టీసీఎస్ ను రిలయన్స్ వెనక్కు నెట్టింది. ఈ ఉదయం బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత రిలయన్స్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే, 1.36 శాతం పెరిగి రూ. 1,410 కి చేరుకోగా, మార్కెట్ కాప్ రూ. 4.58 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో టీసీఎస్ కంపెనీ వాటా విలువ 0.25 శాతం నష్టపోయి, రూ. 2,315కు చేరుకోగా, ఆ సంస్థ మార్కెట్ కాప్ రూ. 4.56 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో ఇప్పుడు ఇండియాలో అత్యధిక విలువైన కంపెనీగా రిలయన్స్ నిలిచింది.

కాగా, ఐటీ సంస్థల ప్రాభవం పెరగకముందు వరకూ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ రారాజుగా ఎన్నో ఏళ్లు కొనసాగిన సంగతి తెలిసిందే. ఆపై రిలయన్స్ మార్కెట్ కాప్ తగ్గి, ఇండియాలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న టీసీఎస్ విలువ పెరుగుతూ వచ్చింది. ఇక జియో సేవలు ప్రారంభమైన తరువాత కూడా రిలయన్స్ ఈక్విటీ కొనుగోలుకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కస్టమర్ల సంఖ్య 10 కోట్లకు పైగా పెరగడం, ఆపై ఏప్రిల్ నుంచి రీచార్జ్ రుసుమును వసూలు చేస్తామని చెప్పడంతో, ఈక్విటీ కొనుగోలుకు డిమాండ్ పెరిగింది.

ఈ నేపథ్యంలో గడచిన మూడు నెలల వ్యవధిలో రిలయన్స్ వాటా విలువ 35 శాతం పెరుగగా, ఇదే సమయంలో టీసీఎస్ కేవలం 2 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. ఇక, సుమారు 2,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి, కస్టమర్లకు ఉచిత సేవలను అందిస్తుండటంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు తొలుత ఆందోళన వ్యక్తం చేసినా, ఆపై డబ్బు వసూలు చేస్తామని చెప్పి, జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను ప్రారంభించాక, 7 కోట్ల మంది వరకూ పెయిడ్ సేవలకు దరఖాస్తు చేసుకోవడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ పెరిగింది. కాగా, మంగళవారం నాడు ఉదయం మధ్యాహ్నం 12:50 గంటల సమయంలో రిలయన్స్ ఈక్విటీ 0.59 శాతం లాభంతో 1,399 వద్ద ఉండగా, టీసీఎస్ విలువ 0.16 శాతం పెరిగి 2,324 వద్ద కొనసాగుతోంది.

More Telugu News