: పళనిస్వామే సీఎం... అంగీకరిస్తూనే తన వర్గం విలీనానికి పన్నీర్ షరతులివి!
తమిళనాడు రాష్ట్రానికి పళనిస్వామి సీఎంగా ఉండటానికి అంగీకరిస్తూ, తన వర్గాన్ని విలీనం చేసేందుకు పన్నీర్ సెల్వం కొన్ని షరతులు విధించారని తెలుస్తోంది. ఈ ఉదయం మధురై నుంచి చెన్నైకి వచ్చిన ఆయన తొలుత తన వర్గం మద్దతుదారులతో, ఆపై చర్చలకు వచ్చిన కొందరు మంత్రులతో మాట్లాడారు. శశికళ, దినకరన్ లను ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి దూరంగా పెట్టాలని, తనకు జాతీయ కార్యదర్శి హోదాతో పాటు, క్యాబినెట్ లో చోటును కల్పించాలని ఆయన షరతులు విధించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇక శశికళ వర్గం అన్న పేరు వినిపించరాదని, ఆ కుటుంబంలోని ఎవరినీ దగ్గరకు చేర్చుకోకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది.