: హెచ్-1బీ వీసాకు మరిన్ని మార్పులు... నేడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్న ట్రంప్
ఫెడరల్ ఏజన్సీలు సిఫార్సు చేసిన విధంగా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కు మరిన్ని మార్పులు చేస్తూ తయారు చేసిన కొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు సంతకం చేయనున్నారు. విదేశాల నుంచి వస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, ఇదే సమయంలో అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, ఈ బిల్లు తయారైందని, 'బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్' నినాదంతో ఇది తయారైందని వైట్ హౌస్ అధికారులు మీడియాకు తెలిపారు. అమెరికాలో తయారయ్యే ఉత్పత్తుల అమ్మకాలను పెంచేలా బిల్లులో కొన్ని నిబంధనలు కలిపినట్టు తెలిపారు.
ప్రస్తుతం విస్కాన్సిన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడే ఈ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేస్తారని తెలిపారు. అమెరికాలోకి వచ్చే ప్రతి కార్మికుడిపైనా, అన్ని రకాల చట్టాలనూ కచ్చితంగా అమలు చేయాలని, నైపుణ్యమున్న ఉద్యోగులను తప్పనిసరిగా తెచ్చుకోవాలంటే, వారికి నిబంధనలకు అనుగుణంగా మరింత వేతనం ఇవ్వాల్సిందేనని ఈ ఆదేశాల్లో ఉన్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీసా మోసాలపై విచారణ జరిపించేందుకు ఇమిగ్రేషన్ వ్యవస్థతో పాటు కార్మిక, న్యాయ, భద్రతా విభాగాలను కూడా భాగస్వామ్యం చేయాలని ఈ ఆర్డర్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, 2016లో 2.36 లక్షలుగా ఉన్న హెచ్-1బీ వీసాల దరఖాస్తులు ఈ సంవత్సరం 1.99 లక్షలకు పడిపోగా, కొత్త బిల్లు అమలైతే, ఈ సంఖ్య మరింతగా తగ్గుతుందని, ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.