: ఎర్రబెల్లి ఫిర్యాదుపై స్పందించిన కేసీఆర్... డీసీసీబీ చైర్మన్ సస్పెండ్
వరంగల్ డీసీసీబీ బ్యాంకులో అక్రమాలు జరిగాయని ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేసీఆర్, విచారణకు ఆదేశించగా, ఆయన ఆరోపణలు నిజమని తేలాయి. దీంతో వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కు తాత్కాలిక ఇన్ చార్జ్ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు పేర్కొంది.
కాగా, దీనిపై జంగా రాఘవరెడ్డి స్పందిస్తూ, తానిప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, టీఆర్ఎస్ పార్టీలో చేరాలని తనపై ఎంతో ఒత్తిడి తెచ్చారని, తాను లొంగకపోవడంతోనే ఇటువంటి దుర్మార్గపు చర్యలకు దిగారని ఆరోపించారు. తనపై సస్పెన్షన్ ను న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.