: పోలీసులు అరెస్ట్ చేసిన వేళ చేతికి 6.5 కోట్ల విలువైన బ్రేస్ లెట్... సుకాష్ చంద్రశేఖర్ గురించిన ఆసక్తికర సమాచారం!
సుకాష్ చంద్రశేఖర్... రెండు రోజుల క్రితం వరకూ ఈ పేరు ఎవరికీ తెలియదు. అన్నాడీఎంకే నేత దినకరన్ కు, ఎన్నికల కమిషన్ కు మధ్య బ్రోకర్ గా మారి, రెండాకుల గుర్తును ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పి, బయానా తీసుకున్న వ్యక్తి. వాస్తవానికి సుకాష్ ను యువకుడు అనే అనాలి. ఎందుకంటే, ఇతని వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్న సుకాష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లే సమయానికి అతని చేతికి రూ. 6.5 కోట్ల విలువైన బ్రేస్ లెట్ ఉంది. సుమారు రూ. 7 లక్షల విలువైన షూస్ ఆయన గదిలో ఉన్నాయి. రూ. 1.30 కోట్ల నగదును దగ్గరే పెట్టుకుని ఉన్నాడు కూడా. అతన్ని విచారిస్తే టీటీవీ దినకరన్ తరఫున ఈసీ అధికారులకు ఇచ్చేందుకు ఈ డబ్బును వెంట పెట్టుకున్నానని చెప్పాడు.
అంతకుముందు నగరంలో నల్లధనం చక్కర్లు కొడుతోందని, పెద్దమొత్తంలో డబ్బు స్టార్ హోటల్లో ఉన్న ఓ యువకుడి వద్ద ఉందని ఉప్పందుకున్న పోలీసులు సుకాష్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లే వరకూ అతని వెనుక ఇంత పెద్ద కథ ఉందని తెలియదు. ఇక అతనిపై బెంగళూరు, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 12 క్రిమినల్ కేసులు విచారణ దశలో ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇంటర్ విద్యను మధ్యలోనే ఆపేసిన సుకాష్ కు నాలుగు సంవత్సరాల నుంచి దినకరన్ తో పరిచయం ఉందని, అతనికి ఎన్నో ఫాం హౌస్ లు ఉన్నాయని, 17 ఏళ్ల వయసు నుంచే ప్రభుత్వ కాంట్రాక్టు పనులను అప్పజెప్పేందుకు మధ్యవర్తిగా పనిచేయడం ప్రారంభించాడని వివరించాయి. అప్పట్లోనే అతను పట్టుబడగా, మైనర్ కావడంతో అరెస్ట్ చేయలేదని, ఆపై మరో సంవత్సరం తరువాత ఇదే పని చేసి అరెస్ట్ అయి కొంతకాలం జైలుకు కూడా వెళ్లాడని పోలీసు వర్గాలు తెలిపాయి.