: ఐఎన్ఎస్ చెన్నైలో విహరిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు... వెంటనే వెనక్కి రావాలని పళనిస్వామి ఆదేశం
శశికళ జైలుకు వెళ్లడం, ఆపై ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో కోట్ల డబ్బు పంపిణీ, అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన్ పై కేసులు, మంత్రులపై ఐటీ దాడులు, 122 మంది ఎమ్మెల్యేలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి... ఇలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పార్టీని, ప్రభుత్వాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. నిన్నటి నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నైలో విహరిస్తుండగా, వారందరినీ తక్షణం వచ్చి తనతో సమావేశం కావాలని కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశించారు.
ఎమ్మెల్యేలతో సమావేశమైన తరువాత, ఆయన స్వయంగా కొంతమంది మంత్రులను వెంటబెట్టుకుని నేటి సాయంత్రం లేదా రాత్రికి పన్నీర్ తో ప్రత్యేకంగా సమావేశమై, రాజీ కుదుర్చుకుంటారని తెలుస్తోంది. శశికళ, దినకరన్ ను తప్పించి, ఆపై పన్నీర్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే, సమస్యలు సద్దుమణుగుతాయని భావిస్తున్న పళనిస్వామి ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, ప్రస్తుతం మధురైలో ఉన్న పన్నీర్ సెల్వం, చెన్నైకి రాగానే ఆయనతో పళనిస్వామి సమావేశం అవుతారని తెలుస్తోంది.