: ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేని 'బాహుబలి' ఎలా హిట్ అయిందని అడిగిన వీవీ వినాయక్!
'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం విడుదలైన తరువాత జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని హీరో ప్రభాస్ తన అభిమానులతో పంచుకున్నాడు. చిత్రం విడుదల తరువాత దర్శకుడు వీవీ వినాయక్ ను తాను, రాజమౌళి కలిశామని గుర్తు చేసుకున్నాడు. శివగామి ఎందుకు చనిపోయిందో అన్న సమాధానం లేని ప్రశ్నతో సినిమా ప్రారంభమై, బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడోనన్న సమాధానం లేని మరో ప్రశ్నతో సినిమా ముగిసిందన్న విషయాన్ని గుర్తు చేసిన వినాయక్, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేని ఈ చిత్రం ఇంత హిట్ ఎందుకు అయింది? అని అడిగినట్టు చెప్పాడు.
దేవసేన సంకెళ్లతో ఎందుకు ఉంది? అవంతిక అక్కడెందుకుంది? భల్లాలదేవుడి భార్య ఎవరు? వంటి ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయని వినాయక్ అడిగాడని వివరించాడు. ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ఓ కథ ఉంటుందని, అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రెండో భాగంలో లభిస్తాయని ప్రభాస్ అన్నాడు. సినిమాలో కొత్తదనం, యుద్ధాలు, చారిత్రక నేపథ్యం ప్రేక్షకులకు నచ్చడం వల్లే సినిమా ఇంత హిట్ అయిందని చెప్పుకొచ్చాడు ప్రభాస్.