: ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం... క్షిపణికి క్షిపణి.. అణ్వస్త్రానికి అణ్వస్త్రం సిద్ధం: ఉత్తర కొరియా యుద్ధనాదం
అమెరికాకు దీటుగా ఉత్తరకొరియా స్పందిస్తోంది. యుద్ధనాదం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ అమెరికా, ఉత్తరకొరియాల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు దేశాలు యుద్ధానికి సిద్ధం అంటూ ప్రకటనలు చేయడం మరింత ఆందోళన పెంచుతోంది. అమెరికా సైనిక శక్తిని పరీక్షించే సాహసం చేయవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఉత్తర కొరియాను హెచ్చరించారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా రాయబారి కిమ్ ర్యాన్ ఇంగ్ మాట్లాడుతూ, అమెరికా సైనిక దాడులకు దిగేందుకు సాహసిస్తే అంతే దీటుగా బదులిచ్చేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికన్ల నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా స్వీకరించేందుకు, తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కవ్వింపు చర్యలకు దిగితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన తెలిపారు. ఉత్తరకొరియా అన్ని ఆత్మరక్షణ చర్యలు తీసుకుందని, తమపై అణుబాంబు దాడులను, ఖండాతర క్షిపణి దాడులను.. అవే తరహాలో తిప్పికొట్టేందుకు తాము కృతనిశ్చయులమై ఉన్నామని ఆయన ప్రకటించారు. అమెరికా వైమానిక యుద్ధవాహక నౌకను కొరియా ద్వీపకల్పంలో మోహరించడాన్ని ఆయన ఉత్తరకొరియాపై దురాక్రమణ ప్రయత్నంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. శత్రువు ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు. దీంతో రెండు దేశాలపై యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి.