: పన్నీర్ తో చర్చలకు 10 మంది సభ్యుల టీమ్ ను ఏర్పాటు చేసిన పళనిస్వామి... 25 మంది మంత్రుల అత్యవసర భేటీ
దాదాపు నెలన్నర క్రితం తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన తమిళనాడు రాజకీయాలు, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళకు, ఆమె అక్క కొడుకు దినకరన్ కు, ఆమె కుటుంబ సభ్యులకు ఎంతమాత్రం ప్రాతినిధ్యం లేకుండా చేయడమే ఏకైక లక్ష్యంతో ఆమె ఏరికోరి ఎంచుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి అడుగులు వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి మద్దతు పెరుగుతూ ఉండటంతో ఆయనతో రాజీకి ప్రయత్నిస్తున్నారు.
పన్నీర్ వర్గానికి మద్దతు పలికితే రాజకీయ సంక్షోభం ముగుస్తుందని, కేసుల భయముండదని భావిస్తున్న 25 మంది మంత్రులు నిన్న రాత్రి చెన్నైలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించగా, ఈ విషయం తెలుసుకున్న పళనిస్వామి తనదైన శైలిలో పావులు కదిపారు. పన్నీర్ తో చర్చలకు పది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని, వారిప్పుడు పన్నీర్ సెల్వంతో చర్చలు జరుపుతూ ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొంగు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కీలక బాధ్యతను నెత్తినేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండు గ్రూపుల విలీన వ్యవహారం ఏమవుతుందో నేడో రేపో తేలిపోతుందని సమాచారం.