: కశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం... ఘర్షణలకు తావులేకుండా నిర్ణయం
జమ్ముకశ్మీర్ లో పలు వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేయాలని టెలికాం కంపెనీలను రాష్ట్ర పోలీసులు ఆదేశించారు. సీఆర్పీఎఫ్ జవానులు రాళ్ల దాడులను ఎదుర్కొనేందుకు తమ వ్యానుకు ఒక వ్యక్తిని తాడుతో కట్టి తీసుకెళ్లడంపై పెనుదుమారం రేగుతోంది. దీనిపై వివిధ ఉగ్రవాద సంస్థలు వివిధ సందేశాలతో పాటు, సీఆర్పీఎఫ్ జవాన్ల చర్యను తూర్పారపడుతూ పలు వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో మళ్లీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించారు. తదుపరి నోటీసులు వచ్చేంతవరకు కశ్మీర్ లోయలో 3జీ, 4జీ సేవలను నిలిపివేయాలని టెలికాం సంస్థలను ఆదేశించినట్టు తెలిపారు. ఈమేరకు అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. సాధారణ పౌరుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు సంఘవిద్రోహ శక్తులు ప్రయత్నిస్తాయని, వాటికి ముకుతాడు వేసేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.