: గుడిలో లేగదూడ తల... అలహాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత!
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ పరిధిలోని శివకుట్టి ప్రాంతంలో ఉన్న అఖిలేశ్వర్ మహాదేవ్ దేవాలయంలో ఓ లేగదూడ తల పడివుండటంతో, ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవాలయం ప్రాంగణంలో లేగదూడ తలను చూసిన ప్రధాన పూజారి అఖిలేష్ పాండే, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న హిందూ సంస్థలు నిరసనలకు దిగి, ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ విధ్వంసాలకు దిగారు.
దీంతో సమీపంలోని నాలుగు పోలీసు స్టేషన్ల బలగాలను శివకుట్టి ప్రాంతానికి తరలించిన అధికారులు, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపుతున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యగా, ఆ ప్రాంతంలోని పాఠశాలలను అధికారులు మూసివేయించారు.