: ఈసీకి ఏకంగా రూ. 60 కోట్లు ఆఫర్ చేసిన దినకరన్.. నేడో, రేపో అరెస్ట్!
గడచిన మూడు నెలలుగా రోజుకో మలుపు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు మరింతగా వేడెక్కాయి. ఓ వైపు శశికళ వర్గం, మరో వైపు పన్నీర్ సెల్వం వర్గం అన్నాడీఎంకే పార్టీపై ఆధిపత్యం, పార్టీ గుర్తు అయిన 'రెండాకులు' కోసం జాతీయ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన వేళ, అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, శశికళ సోదరి తనయుడు దినకరన్, ఈసీకే భారీ ఎత్తున ముడుపులను ఆఫర్ చేసి, ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈసీకి రూ. 60 కోట్లు ఇస్తానని, రెండాకుల గుర్తు తనకు దక్కేలా చేయాలని మధ్యవర్తి సుఖేష్ చంద్రతో డీల్ కుదుర్చుకుని బయానాగా రూ. 1.39 కోట్లు ఇచ్చాడు.
ఆ తరువాత సుఖేష్, పోలీసులకు చిక్కడంతో, మొత్తం వ్యవహారం వెలుగులోకి రాగా, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దినకరన్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినకరన్ ను ప్రశ్నించి, ఆపై అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందం తమిళనాడు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో ఓట్ల కోసం కోట్ల కొద్దీ డబ్బును పంచారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, ఇప్పుడీ కేసులో ఇరుక్కోవడం శశికళ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దినకరన్ ను అరెస్ట్ చేస్తే, ఆ పార్టీలో ఎమ్మెల్యేల నైతిక బలం దెబ్బతింటుందని భావిస్తున్న పన్నీర్ సెల్వం వర్గం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది.