: అప్పుడు, దేవినేని చేపల కూర వండించి ఎన్టీఆర్ కు తీసుకువెళ్లారట!
దేవినేని నెహ్రూకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అంటే దేవినేనికి ఎంత అభిమానం అన్నది పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు. కొన్నేళ్ల క్రితం దేవినేని నెహ్రూ ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ముఖ్యంగా వైశ్రాయ్ ఘటన నాటి విషయాలను ప్రస్తావించారు.
‘వైశ్రాయ్ ఘటన జరిగినప్పుడు ఎన్టీఆర్ పై చెప్పులు పడినప్పుడు చాలా బాధపడ్డాను. నేను, పరిటాల రవి వ్యాన్ నుంచి దిగి వెళ్లాం. పోలీసులు అడ్డం పడ్డారు. అప్పుడు ఎన్టీఆర్ వ్యాన్ దిగుతూ మమ్మల్ని చూసి.. ‘ఎన్టీ రామారావు చచ్చిపోయాడు’ అన్నారు. ఆ తర్వాత ఓ రోజు ఆయన నన్ను రమ్మన్నారు. తినడానికి ఏం తెస్తున్నావని అడిగితే చేపల కూర వండించి తీసుకెళ్లాను. ఆయన ఆప్యాయంగా తిన్నారు..’ అని నాటి ఇంటర్వ్యూలో దేవినేని అన్నారు.