: పటీదార్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం... స్వరాష్ట్రంలో హిందీలో మాట్లాడిన మోదీ!
నిన్న గుజరాత్ లో ఘన స్వాగతం నడుమ అడుగుపెట్టిన మోదీ, నేడు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ ఉదయం సూరత్ లో ఓ వజ్రాల ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆయన, ఆపై పటీదార్ వర్గం అత్యధికంగా ఉండే ప్రాంతంలో ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిజర్వేషన్ల కోసం పట్టుబడుతూ ఉద్యమిస్తున్న పటీదార్ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించే ముందు "నేనిప్పుడు హిందీలో మాట్లాడాలా? గుజరాతీలో మాట్లాడాలా? అన్న డైలమాలో ఉన్నాను. అయినా మీకోసం నేను హిందీలో మాట్లాడతాను. దేశానికి కూడా నేనేం చెబుతున్నానో తెలుస్తుంది" అంటూ మాతృభాష గుజరాతీని పక్కనబెట్టి హిందీలో మాట్లాడారు.
గుజరాత్ లో శక్తిమంతమైన వర్గంగా, ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ఎదిగిన పటీదార్ వర్గం ఇటీవలి కాలంలో బీజేపీకి దూరమవుతోందని వస్తున్న విశ్లేషణల నేపథ్యంలోనే వారికి పెద్దపీట వేయాలని మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక పటీదార్లు అధికంగా ఉన్న సౌరాష్ట్ర ప్రాంతంలో నర్మదా నది నీటిని ప్రతి గ్రామానికీ అందించేందుకు రూ. 12 వేల కోట్ల అంచనా వ్యయంతో 100 డ్యాముల నిర్మాణానికి నేడు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గుజరాత్ లో వరుసగా ఐదవ సారి అధికారంలోకి రావాలంటే, పటీదార్ల ఓట్లు కీలకమని ఆయన భావిస్తున్నారు. ఇక నిన్న డైమండ్ హబ్ గా పేరు తెచ్చుకున్న సూరత్ కు వచ్చిన ఆయనకు 10 వేల బైకులతో బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.