: నెహ్రూ మరణంతో బెజవాడ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది!
దేవినేని రాజశేఖర్... ఈ పేరు చెబితే ఎవరీ రాజశేఖర్ అనే ప్రశ్నే ఉత్పన్నమవుతుంది. అదే దేవినేని నెహ్రూ... అంటే, పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక విజయవాడలో అయితే ఈ పేరు తెలియని వారుండరు. ఇప్పుడు నవ్యాంధ్రకు నూతన రాజధానిగా నిలిచిన విజయవాడ ప్రాంతం రాయలసీమ తరువాత ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరన్నది అత్యధికులు అంగీకరించే విషయమే. ఈ ప్రాంతంలో దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య ఉన్న దశాబ్దాల వైరం ఎన్నో ప్రాణాలను బలిగొంది. ఒకప్పుడు అత్యంత సన్నిహితవర్గాలుగా మెలిగిన వంగవీటి మోహనరంగా కుటుంబం, దేవినేని నెహ్రూ, మురళి సోదరులు, ఆపై మారిన రాజకీయ పరిస్థితుల్లో శత్రువులుగా మారగా, ఫ్యాక్షన్ మంటల్లో పడి ఎంతో మంది సమిధలయ్యారు. వీరి గొడవలు రెండు సామాజిక వర్గాల వైరంగా మారింది.
ముఖ్యంగా వంగవీటి రాధా, ఆపై మోహనరంగాల హత్యల తరువాత దేవినేని కుటుంబం రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. సరైన పోటీ ఇచ్చే నాయకులు లేక, దేవినేని నెహ్రూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఓ దఫా మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆయన హవా ఎలా సాగేదంటే, విజయవాడలో 'సి' బ్యాచ్ పేరుతో బైకుల వెనుక స్టిక్కర్లు వేసుకుని 2 వేల మంది వరకూ అనుచరులు తిరుగుతుండేవారు. వీరిని అడ్డుకునేందుకు ఏ ఒక్కరికీ ధైర్యముండేది కాదు.
రంగా హత్యతో తనకు ఏ సంబంధం లేదని, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని నెహ్రూ ఎంతగా చెప్పుకున్నా, ఈ విషయాన్ని పూర్తిగా నిజమని నమ్మే బెజవాడ వాసులు కనిపించరంటే అతిశయోక్తి కాదు. దాదాపు 28 సంవత్సరాల క్రితం జరిగిన రంగా హత్య, నిన్నటి వరకూ కూడా దేవినేని నెహ్రూను వెంటాడిందనే చెప్పాలి. వర్తమాన రాజకీయాల్లో వయోవృద్ధుడిగా ఉన్న హరిరామజోగయ్య, రంగా హత్యను చంద్రబాబు చేయించాడని, నెహ్రూ దగ్గరుండి పథకం రూపొందించారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
1979లో గాంధీ హత్య జరిగింది. ఆ తరువాత, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం జరిగిన సమయంలో దేవినేని కుటుంబం టీడీపీని ఆశ్రయించగా, వంగవీటి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మోహనరంగా ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ రెండు కుటుంబాల మధ్యా గొడవలు తారస్థాయికి చేరాయి. నాడు దేవినేని గాంధీ హత్య తరువాత తారస్థాయికి చేరిన వర్గ విభేదాల కారణంగా, కేసులో నిందితులైన కొంతమంది రంగా అనుచరులను దేవినేని వర్గం హత్య చేయిస్తే, దానికి ప్రతీకారంగా దేవినేని మురళిని రంగా వర్గం హత్య చేయించింది. రంగా హత్యతో కృష్ణా జిల్లాతో పాటు నాలుగు జిల్లాలు అట్టుడకగా, రెండు నెలల పాటు కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందంటే, ఎంత మారణహోమం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆనాటి గొడవల్లో 42 మంది మరణించగా, అప్పట్లోనే రూ. 110 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కనిపించిన బస్సును కనిపించినట్టు దగ్ధం చేయగా, 700 బస్సులు కాలి బూడిదయ్యాయి. 125 పోలీసు జీపులను రంగా అభిమానులు ధ్వంసం చేశారు.
విజయవాడ అంటే, కనకదుర్గమ్మ కొలువైన పవిత్ర పుణ్య స్థలమే కాదు... 'రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం ఎలానో బెజవాడ అంటే రౌడీయిజం' అనేలా ఎన్నో సంవత్సరాలు కక్షలు కార్పణ్యాలతో సాగాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ, ఆధిపత్య పోరు కారణంగా ఒకరి అనుచరులను మరొకరు హత్యలు చేసుకోవడంతో ప్రారంభమైన వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య గ్రూపు తగాదాలు రావణకాష్టంలా కాలుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు దేవినేని నెహ్రూ మరణంతో బెజవాడ రౌడీ రాజకీయాల్లో వృద్ధతరం ముగిసినట్టే!