: ఇలాగైతే ఇక కప్పు వచ్చినట్టే!: కోహ్లీ అసంతృప్తి


సొంత గడ్డపై, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శనపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓడిపోవడం శోచనీయమని, ఇలాగే ఆడితే, ఈ సీజన్ పోటీల్లో విజయం సాధించడానికి తాము అర్హులం కాదని అన్నాడు. గత రాత్రి మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, గత మ్యాచ్ లో చాలా బాగా ఆడామని, పుణెతో మ్యాచ్ లో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేదని చెప్పాడు. పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నాడు. ఆఖరి ఓవర్లలో తమ బౌలర్లు ఎక్కువ పరుగులను సమర్పించుకున్నారని, అదే కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. పుణె టీమ్ తమ కన్నా బాగా ఆడిందని చెప్పుకొచ్చాడు. గత సంవత్సరం తమ జట్టు చక్కగా రాణించిందని, అదే స్థాయి ప్రదర్శన ప్రతి యేటా సాధ్యం కాదని వెల్లడించాడు. కాగా, నిన్నటి మ్యాచ్ లో పుణె జట్టు, రాయల్ చాలెంజర్స్ ని 27 పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News