: తెలంగాణ వారసత్వ కట్టడాలు, జీఎస్టీ బిల్లులకు టీ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ వారసత్వ కట్టడాల బిల్లు, జీఎస్టీ బిల్లులకు టీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వారసత్వ కట్టడాల బిల్లును మంత్రి చందులాల్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం, సీఎం కేసీఆర్, ఇతర సభ్యులు ఈ బిల్లుపై సభలో చర్చించారు. చర్చ అనంతరం బిల్లును ఆమోదించారు. వారసత్వ సంపదను పరిరక్షించుకుందామని, కొత్త బిల్లుతో చారిత్రక సంపదను పరిరక్షిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. వారసత్వ కట్టడాల బిల్లులో ఏయే కట్టడాలను చేర్చాలో సీఎస్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.
పురాతన కాలానికి చెందిన ప్రతి బిల్డింగ్ వారసత్వ సంపద కాదన్నారు. గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ఈ జాబితాలోకి రాదన్నారు. జోగులాంబ ఆలయాన్ని ఆర్కియాలజీకి ఇవ్వడంతో సమస్య ఎదురువుతుందన్నారు. అఖిలపక్ష సమావేశంలోవారసత్వ సంపదపై చర్చిద్దామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వ కట్టడాల పరిరక్షణను విస్మరించారని ఈ సందర్భంగా కేసీఆర్ విమర్శించారు. కాగా, జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో 196 దేశాలు ఉంటే, అందులో 160 దేశాల్లో ఈ బిల్లు ఇప్పటికే అమలవుతోందన్నారు.