: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో వ్యాపారుల ఆందోళన.. నిలిచిపోయిన కొనుగోళ్లు!
విజిలెన్స్ దాడులు, ఇథలిన్ వాడకంపై ఆంక్షలను నిరసిస్తూ హైదరాబాద్ లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వ్యాపారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఆందోళనకు దిగడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో, సరుకు అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి కొనుగోళ్లు నిలిపివేయడంతో సరుకు పాడైపోతుందని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై అధికారులు పట్టించుకోకపోవడంతో పండ్ల మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో, అధికారులు దిగొచ్చారు. వ్యాపారులతో చర్చలు ప్రారంభించారు. కాగా, రైతుల ఆందోళనతో దిల్ సుఖ్ నగర్-ఎల్బీనగర్ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.