: అందుకే చంద్రబాబు నాపై నిందలు వేస్తున్నారు!: మరోసారి మీడియా ముందుకు ఎంపీ శివప్రసాద్
దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందునే చంద్రబాబునాయుడు తనపై నిందలు మోపుతున్నారని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యానించారు. తనను కలిసి సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున తరలి వచ్చిన దళిత సంఘాల నేతలతో ఆయన మాట్లాడారు. తమవారికి న్యాయం చేయాలని అడగటమే తప్పయిపోయిందని ఈ సందర్భంగా శివప్రసాద్ వ్యాఖ్యానించారు.
బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదెందుకని ప్రశ్నించడం, డీకేటీ భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని అడగటంతోనే తనపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు కేటాయించలేదని ప్రశ్నించినందుకు కూడా నిందలు మోపారని ఆయన ఆరోపించారు. కాగా, టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన శివప్రసాద్ పై క్రమశిక్షణా చర్యలు తప్పవని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.