: 'పూర్ ఇండియా' అనలేదు: స్నాప్ చాట్ వివరణ
తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇవాన్ స్పీగల్ 'పూర్ ఇండియా' కామెంట్ చేయలేదని స్నాప్ చాట్ వివరణ ఇచ్చింది. ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని, మాజీ ఉద్యోగి మాట్లాడిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయిస్తామని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, స్నాప్ ఛాట్ యాప్ కేవలం ధనికుల కోసమే తప్ప ఇండియా, స్పెయిన్ వంటి పేదలున్న దేశాల కోసం కాదని ఇవాన్ స్పీగల్ వ్యాఖ్యానించినట్టు ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియానో వెల్లడించగా, ఆ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆపై స్నాప్ చాట్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై వివరణ ఇచ్చిన స్నాప్ చాట్, తమ సంస్థ భవిష్యత్ వ్యూహాల గురించి పాంప్లియానోకు ఎంతమాత్రమూ తెలియదని చెప్పుకొచ్చింది. కాగా, 2011లో స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ విద్యార్థులు ఈవాన్ స్పీగల్, బాబీ ముర్ఫీ, రెగ్గీ బ్రౌన్ లు ఈ యాప్ ను ప్రవేశపెట్టగా, ప్రపంచవ్యాప్తంా 50 కోట్ల మందికి పైగా దీన్ని వాడుతున్నారు. గత నెలలో సంస్థ ఐపీఓకు రాగా, 3.4 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే.