: దమ్ముంటే ఆ మాట చెప్పగలరా? జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ అసెంబ్లీలో రగడ
కేవలం ముస్లిం సోదరుల ఓట్లను కొల్లగొట్టేందుకు మాత్రమే అమలుకు సాధ్యం కాని రిజర్వేషన్ల కోటా బిల్లును టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాగా, బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఎన్నికల్లోగా అమలు చేయకుంటే, వారి ఓట్లను తాము అడగబోమని, వారు ఓట్లే తమకు వేయవద్దని చెప్పే దమ్మూ, ధైర్యమూ కేసీఆర్ కు ఉన్నాయా? అని వ్యాఖ్యానించడంతో అసెంబ్లీలో రభస మొదలైంది. ఈ బిల్లుపై మీకు అంత విశ్వాసం ఉంటే, ఆ మాటలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంఖ్యా బలం ఉందన్న భావనతో ఏం చేసినా చెల్లిపోతుందని భావించడం సరికాదన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.