: కోటా పెంపును కేంద్రం అడ్డుకుంటే చేతులు ముడుచుకుని కూర్చునేది లేదు: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తెచ్చిన ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల కోటా పెంపు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపుతామన్న నమ్మకం తనకుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆపై బిల్లు ఆమోదం కోసం పట్టుబడతామని తేల్చి చెప్పారు. కోటా పెంపును వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్ లో చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నదని, ఈ విషయంలో మీనమేషాలు లెక్కించినా, బిల్లును తిరస్కరించినా చేతులు ముడుచుకుని కూర్చోబోమని, సుప్రీంకోర్టును ఆశ్రయించి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశంలో ఒక రాష్ట్రానికి ఒక చట్టం, మరో రాష్ట్రానికి మరో చట్టం ఉండబోదని, తమిళనాడులో ఒప్పుకున్నట్టుగానే, తెలంగాణలోనూ ఈ రిజర్వేషన్ బిల్లును అంగీకరించాల్సిందేనని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో విపక్షాలకు ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం ముస్లిం వర్గాలను మభ్య పుచ్చేందుకే ఈ బిల్లును తీసుకు వచ్చారని దుయ్యబట్టారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి పార్టీ తమదేనని, తామే 4 శాతం రిజర్వేషన్ ను ముస్లింలకు దగ్గర చేశామని తెలిపారు. దాన్ని 5 శాతానికి పెంచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో 2004లోనే ప్రయత్నించామని గుర్తు చేశారు.