: సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కాలిఫోర్నియాలో నడిపించేందుకు యాపిల్ కు అనుమతి
కాలిఫోర్నియా రహదారులపై అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను నడిపించి పరీక్షించేందుకు అవసరమైన అనుమతులు యాపిల్ సంస్థకు లభించాయి. ప్రపంచంలోని మోస్ట్ వాల్యుబుల్ టెక్నాలజీ కంపెనీగా ఉన్న యాపిల్ కు, కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్ నుంచి అనుమతులు లభించాయి. 2015లో సంస్థ తయారు చేసిన లెక్సస్ ఆర్ఎక్స్ 450 హెచ్ లగ్జరీ హైబ్రిడ్ ఎస్యూవీలను రహదారులపై తిప్పనున్నామని, అవసరమైతే వీటి నియంత్రణను చేపట్టేందుకు ఆరుగురికి అనుమతి లభించిందని యాపిల్ పేర్కొంది.
కాగా, తొలుత ప్రాజెక్ట్ టైటాన్ పేరిట సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టును చేపట్టిన యాపిల్, ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో ఈ కార్లను ప్రయోగాత్మకంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికతను పరిచయం చేయాలన్న సంస్థ లక్ష్యాల్లో భాగంగానే ఈ కారును రూపొందించామని గత సంవత్సరం అక్టోబరులో యాపిల్ చీఫ్ టిమ్ కుక్, ఇన్వెస్టర్లతో జరిగిన సభలో ప్రకటించారు. ఇక ఈ కారు ఎటువంటి ప్రమాదాలు చేయకుండా, ప్రమాదాలకు గురికాకుండా తప్పించుకుని కాలిఫోర్నియా రహదారులపై సురక్షితమని నిరూపించుకోవాల్సి వుంటుంది.