: తెలంగాణ సర్కారు కొత్తగా ఎస్టీల్లో చేర్చిన కులాలివి!
తెలంగాణ జనాభాలో 9.08 శాతం మంది ఎస్టీలున్నారని, ఏపీలో ఎస్టీల్లో ఉన్న కొన్ని కులాల ప్రజలు తెలంగాణలో అదే జాబితాలో లేరని చెప్పిన సీఎం కేసీఆర్, కొన్ని కులాలను కొత్తగా ఎస్టీల జాబితాలో చేర్చుతున్నట్టు ప్రకటించారు. కొత్తగా వాల్మీకి బోయలను, కాగిత లంబాడీ కులాలను ఎస్టీల్లో చేరుస్తున్నట్టు ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్ కోటా బిల్లులో ఆయన ప్రతిపాదించారు. ఇండియాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకుని, వీటన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని కోరుతున్నట్టు కేసీఆర్ తెలిపారు. రాజ్యాంగంలో 50 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని ఎక్కడా స్పష్టంగా లేదని, జనాభా లెక్కలకు అనుగుణంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని అన్నారు.
ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పిస్తూ, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెబుతూనే, అదే తీర్పులో భాగంగా, గణించదగిన డేటా ఉంటే, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్లు పెంచుకోవచ్చని పేర్కొన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. అదే విధమైన ప్రత్యేక పరిస్థితి తెలంగాణలో ఉందని, నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఇదే విధంగా 80 శాతం వరకూ, జార్ఖండ్ లో 60 శాతం వరకూ గిరిజనులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, వీటన్నింటినీ పరిశీలించే కోటా పెంపును అమలు చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా 90 శాతం కన్నా అధికమని చెబుతూ, 50 శాతం పరిమితి రాష్ట్రానికి సరిపడదని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిందేనని, తమిళనాడు తరహాలోనే ఈ బిల్లును కూడా 9వ షెడ్యూల్ లో పెట్టాలని మోదీని కేసీఆర్ కోరారు.