: 'యోగి యోగి' అనకుంటే యూపీ వదలాల్సిందే... కలకలం రేపుతున్న హిందూ యువ వాహిని హోర్డింగ్స్
ఉత్తరప్రదేశ్ లో ప్రజలు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును స్మరించాల్సిందేనని, అందుకు వ్యతిరేకించే వారు రాష్ట్రాన్ని విడిచిపోవాలని హిందూ యువవాహిని మీరట్ ప్రాంతంలో వేసిన హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ హోర్డింగ్స్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులు తదితరుల ఇళ్ల సమీపంలో వెలిశాయి. జిల్లా కమిషనర్ ఇంటి ముందు కూడా ఇదే హోర్డింగ్ వెలిసింది. ఈ హోర్డింగ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం ఆదిత్యనాథ్ తో పాటు జిల్లా హిందూ యువ వాహిని చీఫ్ నీరజ్ పాంచాలి ఫోటోలు ఉన్నాయి.
"ప్రదేశ్ మే రెహనా హైతో యోగి యోగి కెహనా హై" (ఎవరైతే రాష్ట్రంలో ఉండాలని అనుకుంటారో వారు యోగి యోగి అనాల్సిందే) అని ఈ హోర్డింగ్ లపై ఉంది. వీటిపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ జే రవీంద్ర గౌర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ల నుంచి రిపోర్టు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.