: 36-24-36 కొలతలు చెప్పిన రచయితపై సీబీఎస్ఈ కేసు
ఇంటర్ ఫిజిక్స్ పుస్తకంలో, మహిళలకు '36-24-36' కొలతలు ఉంటేనే వారిని అత్యుత్తమంగా గుర్తిస్తారని రాసిన రచయిత, పుస్తకాన్ని ప్రచురించిన సంస్థపై కేసును పెట్టినట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. 1986 నాటి ఇండీసెంట్ రిప్రజంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఇది మహిళలను కించపరచడం, విద్యార్థినీ, విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇవ్వడమేనని ఈ సందర్భంగా సీబీఎస్ఈ అభిప్రాయపడింది.
పుస్తకాన్ని రాసిన వీకే శర్మ, ప్రచురించిన ఢిల్లీలోని న్యూ సరస్వతి హౌస్ లపై కేసు నమోదైంది. ఈ పుస్తకంలో "మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అందాల పోటీల్లోనూ అమ్మాయిల 36-24-36 శరీర కొలతలను పరిగణనలోకి తీసుకుని విజేతలను నిర్ధారిస్తారు" అని ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలోని వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇంటర్ కరికులమ్ లో యువత ఆరోగ్యం, ఫిట్ నెస్ పై మరింత అవగాహన కోసం, పోషకాహారం, యోగా, జీవన విధానం, సైకాలజీ, శిక్షణ, క్రీడలు తదితర అంశాల ప్రస్తావన ఉండాల్సి వుందని, అదే పాఠ్యాంశంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.