: సకల రాజభోగాలు, ఐశ్వర్యంతో విలసిల్లిన 'మాహిష్మతి' రాజ్యం.. చరిత్రకారుల అధ్యయనం!
ఎత్తయిన వింధ్య పర్వత సాణువుల్లో, అడవులు, జలపాతాల అందాల మధ్య, శత్రుదుర్భేద్యమైన మాహిష్మతి సామ్రాజ్యం నిజంగానే ఉందని, ఆ రాజ్యాన్ని గిరిజనులు పాలించారని, అక్కడ సకల రాజభోగాలు, ఐశ్వర్యం తులతూగిందని చరిత్రకు సంబంధించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మధ్య భారత్, అంటే... ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, వింధ్య పర్వతాలకు రెండు వైపుల విస్తరించిన అవంతి రాజ్యంలో ఉత్తరాదికి ఉజ్జయిని రాజధాని కాగా, దక్షిణాదికి మాహిష్మతి రాజధానిగా ఉందని చరిత్ర కారులు స్పష్టం చేస్తున్నారు. మాహిష్మతి రాజ్య ప్రస్తావన చరిత్ర పుటలతో పాటు ఇతిహాసాల్లోనూ ఉంది.
మధ్య, పశ్చిమ భారతావనిని పరిపాలించిన ఐదు తెగల సమాఖ్య 'హయ్ హాయాస్' మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకొని సుపరిపాలన సాగించారన్న వాదన కూడా ఉంది. పీకే భట్టాచార్య రచించిన 'హిస్టారికల్ జియాగ్రఫీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ ఎర్లీ రికార్డ్స్' అనే పుస్తకంలో ఈ ప్రస్తావన ఉంది. మహాభారతంలోని అనుశాసన పర్వంలోనూ మాహిష్మతి ప్రస్తావన ఉందని, ఆ కాలంలోని కార్తవీర్యార్జునుడే మాహిష్మతిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రాజు హయ్‌హాయా అయ్యుండవచ్చని భట్టాచార్య చెబుతున్నారు.
ఇక సంస్కృత రచన 'హరివంశ' సాహిత్యంలోనూ మాహిష్మతి ప్రస్తావన ఉంది. మాహిష్మతి అనే రాజు స్థాపించినందున దీనికి ఆయన పేరే వచ్చిందని, ఆయన రుగ్వేదంలో పేర్కొన్న ఆర్యుల్లో ఓ వర్గం వారైన యదు వంశీకుడని ఈ పుస్తకం చెబుతోంది. మరో వాదన ప్రకారం, యదు వారసుల్లోనే ఒకరైన ముకుకుండ ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశారని ఉంది. ఇక మాహిష్మతి రాజ్యానికి అనుపమ అని కూడా పేరుందని 'రఘువంశ' పుస్తకం చెబుతోంది. ఇది అందరూ ఊహిస్తున్నట్టు నర్మదా నది పక్కన కాకుండా రేవా నది పక్కన కొండ ప్రాంతంలో ఓ దీవిగా విలసిల్లిందని, శివునికి పరమ పవిత్రమైన స్థలంగా భావించే మాంధాత గ్రామం ఇక్కడికి సమీపంలోనే ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇప్పటికీ మాంధాత గ్రామంలో ఓంకార నాథ ఆలయంలో శివుడు పూజలందుకుంటున్నారు.
అంతేకాదు, మహాభారతంలోనూ మాహిష్మతి ప్రస్తావన ఉండటం గమనార్హం. పాండవులకన్నా ముందు నీల అనే పేరున్న రాజు మాహిష్మతి రాజ్యాన్ని పాలించినట్టు తెలుస్తోంది. అగ్ని దేవుడి కూతురిని ప్రేమించిన నీల, తొలుత అతనిపై యుద్ధానికి వెళ్లి, ఆపై అగ్ని శక్తి తెలుసుకుని, తన రాజ్యానికి రక్షకుడిగా ఉండాల్సిందిగా కోరినట్టు, ధర్మరాజు మాహిష్మతిపై దండయాత్రకు వెళ్లిన వేళ, నీల రాజుకు అగ్ని దేవుడు రథ సారథిగా వ్యవహరించాడని మహాభారతంలో ఉంది. విష్ణు పురాణంలోనూ దీని ప్రస్తావన ఉంది. కార్యవీర్యార్జునుడు మాహిష్మతిని పాలిస్తున్న వేళ రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఓడిపోయినట్టు అందులో ఉంది.
ఇక ఈ విషయాలను, చరిత్రను తెలుసుకునే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి' కథ రాశారా? అన్నది ఆయన చెప్పాల్సివుంది.