: సిరియాలో ప్రయాణికులే లక్ష్యంగా బస్సుపై ఆత్మాహుతి దాడి... 43 మంది మృతి
సిరియాలో సురక్షిత ప్రాంతాలకు బస్సుల్లో తరలుతున్న అమాయక ప్రజలు లక్ష్యంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరపడంతో 43 మంది దుర్మరణం పాలయ్యారు. ఉగ్రవాదుల ప్రాబల్యమున్న రఖా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా అమెరికా సైనికులు చొచ్చుకుపోతున్న వేళ, వారిని నిలువరించలేకపోతున్న ఐఎస్ఐఎస్ ఫైటర్లు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కొన్ని నిత్యావసరాలను వ్యానులో తెస్తున్న సూసైడ్ బాంబర్, బస్సులకు సమీపంలో తనను తాను పేల్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలిస్తున్న ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఘటనా స్థలిలో మృతుల శరీరాలు ఛిద్రమై కనిపించాయని ఏఎఫ్పీ ప్రకటించింది. ఆత్మాహుతి దాడిలో పలువురు చిన్నారులు కూడా మరణించారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు.