: ఢిల్లీ డేర్ డెవిల్స్ ముందు చిన్నబోయిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్... చిత్తుగా ఓటమి!
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ప్రత్యర్థితో పోలిస్తే పైచేయి సాధించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. బిల్లింగ్స్, ఆండర్సన్ లు బ్యాటుతో రాణించగా, ఆపై మోరిస్, నదీమ్ చెలరేగి పంజాబ్ ఆటగాళ్ల నడ్డి విరిచారు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ సీజన్ లో వరుసగా రెండో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది.
ఆపై కింగ్స్ ఎలెవన్ బ్యాటింగ్ కు దిగగా, ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. తొలి మూడు వికెట్లూ 31 పరుగులకే పతనం కాగా, అక్షర్ పలేల్ 29 బంతుల్లో 44 పరుగులు చేసి రాణించినా, అతని శ్రమ ఫలించలేదు. 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లను కోల్పోయి 137 పరుగులకే కింగ్స్ ఎలెవన్ పరిమితం కాగా, ఢిల్లీ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్ (22 బంతుల్లో 39 పరుగులు) చేసి, ఓ వికెట్ ను తీసిన ఆండర్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.