: ఇక ఉపేక్షించేది లేదు... ఒకరిద్దరిపై వేటు వేస్తేనే దారికొస్తారు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీకి, అధినాయకత్వానికి వ్యతిరేకంగా పార్టీలో పెరుగుతున్న నిరసన స్వరాలపై ఇక ఉపేక్షించరాదని, ఒకరిద్దరిపై వేటు వేస్తేనే మిగతావారు దారికి వస్తారని సీఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో కొందరు నేతలు పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ ఉండటం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి మంత్రి వర్గ విస్తరణ తరువాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొండా ఉమ, జలీల్ ఖాన్ తదితరులతో పాటు, మొన్నటి అంబేద్కర్ జయంతి రోజున ఎంపీ శివప్రసాద్ అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్న చంద్రబాబు, నిన్నటి వీడియో కాన్ఫరెన్స్ లో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. సన్నిహితులతో వేటు వేసే విషయమై సుదీర్ఘంగా చర్చించారు.
హెచ్చరించి వదిలేస్తే, అలుసుగా తీసుకుంటున్నారని, ఒకరిద్దరిపై వేటు తప్పదని తన మనసులోని మాటను వెల్లడించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ద్వారా వీరంతా పార్టీ పరువును తీస్తున్నారని పేర్కొంటూ, శివప్రసాద్ పై వేటు తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. ఇదిలావుండగా, చంద్రబాబుతో మాట్లాడిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, శివప్రసాద్ పై వేటు ఇప్పుడే వద్దని, దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని తరువాత నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.