: ఇండియా, స్పెయిన్ లాంటి పేదదేశాల్లో నాకు వ్యాపారం అవసరం లేదు: స్నాప్ ఛాట్ సీఈవో సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగెల్ భారత్, స్పెయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. స్నాప్ ఛాట్ యూజర్ బేస్ వృద్ధిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్నాప్ ఛాట్ యాప్ కేవలం ధనికుల కోసమే తప్ప పేదల కోసం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద దేశాలైన భారత్, స్పెయిన్ వంటి దేశాల్లో తమ వ్యాపార విస్తరణ కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము కేవలం ప్రీమియం యూజర్లపైనే దృష్టి సారించామని ఆయన అన్నారు.
కాగా స్నాప్ చాట్ ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాములను మోసం చేస్తోందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియానో ఆరోపిస్తూ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. ఇలా వారిని మోసం చేసే కంటే ఇండియా, స్పెయిన్ వంటి దేశాల్లో పొటెన్షియల్ గ్రోత్ పై దృష్టి సారించాలని తాను సూచించానని ఆయన తెలిపారు. ఈ దేశాల్లో స్నాప్ ఛాట్ కు మంచి అవకాశాలు ఉన్నాయని తాను సూచించానని, అయితే స్పీగెల్ జోక్యం చేసుకుని ‘‘స్నాప్ చాట్ కేవలం సంపన్నులకు మాత్రమే’’నని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఆయన కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఈ విషయాన్ని వెల్లడించిన పత్రిక తన కథనంలో పేర్కొంది.