: నేను మంచి నటుడినని భారతీరాజా ఎప్పటికీ అంగీకరించరు: రజనీకాంత్
తాను మంచి నటుడిని కాదన్నది ప్రముఖ దర్శకుడు భారతీరాజా అభిప్రాయమని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సినిమా (బీఐఐసీ) ప్రారంభోత్సవానికి హాజరైన రజనీకాంత్ మాట్లాడుతూ, భారతీరాజా అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. అలాగే ఆయన కూడా తనను బాగా ఇష్టపడతారని చెప్పారు. 40 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో కేవలం రెండే రెండు సందర్భాల్లో భారతీరాజా, తాను కలుసుకున్నామని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ‘16 వయదిన్నెల్’ సినిమాకు కాల్షీట్ తీసుకునేందుకు ఒకసారి, మరోసారి ఈ ఫంక్షన్ లో అని ఆయన తెలిపారు. తాను కూడా ఒక ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్థినేనని ఆయన గుర్తుచేసుకున్నారు.
దివంగత దర్శకుడు కె.బాలచందర్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని వెల్లడించారు. నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఫిలిం స్కూల్ నేర్పుతుందని ఆయన తెలిపారు. గతంలో కొంతమంది జర్నలిస్టులు తన గురించి భారతీరాజాను ప్రశ్నించారని, అప్పుడాయన 'రజనీకాంత్ మంచి వ్యక్తి' అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. తానొక మంచి నటుడిని అని ఆయన ఎప్పటికీ అంగీకరించరని రజనీ నవ్వుతూ అన్నారు. అసలు ఇప్పటికీ ఆయనను నటుడిగా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు?’ అని భారతీరాజా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారని ఆయన అన్నారు.
అనంతరం భారతీరాజా మాట్లాడుతూ, రజనీకాంత్ చాలా సాధారణమైన వ్యక్తి అని అన్నారు. '16 వయదిన్నెల్' చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారని, ఇప్పుడాయన ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. అందుకు చాలా సంతోషమని ఆయన తెలిపారు. అలాగే రజనీ జీవితంలో తనది చాలా చిన్న పాత్ర అని, ఆయన సినీ జీవితంలో ఎదుగుదలలో తనది కీలక పాత్ర అని ఎన్నటికీ అననని ఆయన తెలిపారు. రజనీకాంత్ స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని ఆయన చెప్పారు.