: ఐపీఎల్ చరిత్రలో సురేష్ రైనా అరుదైన రికార్డు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-10 సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన సురేష్ రైనా ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ సీజన్‌లలో మొత్తం 150 మ్యాచులు ఆడి, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఆయన నిలిచాడు. 150 మ్యాచ్‌లలో రైనా... మొత్తం 4,206 పరుగులు సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 2013లో అత్యధికంగా 548 పరుగులు సాధించాడు. ఇక అన్ని ఐపీఎల్‌లలో కలిపి మహేంద్ర సింగ్ ధోనీ 147 మ్యాచ్‌లు ఆడగా, గంభీర్ 135 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ధోనీ.. పుణే జట్టు తరఫున, గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై జట్టులో సురేష్‌రైనా 2015 వరకు ఆడాడు. 2016 నుంచి గుజరాత్ లయన్స్ జట్టు సారథిగా వ్యవహరిస్తున్నాడు. 2010లో మూడు మ్యాచ్‌లకు ధోనీ అందుబాటులో లేకపోవడంతో చెన్నై జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.