: యుద్ధం జరిగితే భిన్న స్థాయుల్లో పెను విధ్వంసం జరుగుతుంది: చైనా
సిరియాలోని షైరత్ వైమానిక స్థావరంపై దాడి, అనంతరం ఆఫ్గనిస్థాన్‌లోని ఐఎస్ఐఎస్ స్థావరంపై అతి పెద్ద న్యూక్లియర్ రహిత బాంబుతో దాడి చేసిన అమెరికా తన తదుపరి లక్ష్యంగా ఉత్తరకొరియాను పెట్టుకుందని అంతా భావిస్తుండడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై చైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. భిన్న స్థాయుల్లో పెను విధ్వంసం జరుగుతుందని మాత్రం చెప్పిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. విజేతలుగా మాత్రం ఎవ్వరూ ఉండరని అన్నారు. యుద్ధం జరిగితే గెలుపు, ఓటమి అంటూ ఎలాంటి ఫలితాలు ఉండవని అన్నారు.
ఆరోసారి అణు పరీక్షలు జరపడానికి ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చైనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఇరు దేశాల మధ్య తాము ఎలాంటి చర్చలకైనా మద్దతిస్తామని చెప్పారు. ఉత్తర కొరియాకు ఇంధనం, ఆహార ఉత్పత్తులు పంపిణీ చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. దీంతో యుద్ధం జరిగితే అమెరికా, ఉత్తరకొరియాలతో పాటు చైనాకు కూడా నష్టమే.