: కుల్‌భూషణ్ మంచోడా? మరి ఆయన వద్ద రెండు పాస్‌పోర్టులు ఎందుకున్నాయ్?: ప్రశ్నించిన పాక్


గూఢచర్యం ఆరోపణలపై పాక్ ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ మంచోడని భారత్ చెబుతుందోని, మరి అదే నిజమైతే ఆయన వద్ద రెండు పాస్‌పోర్టులు, నకిలీ ఐడీ ఎందుకు వున్నాయని పాక్ శుక్రవారం ప్రశ్నించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ విదేశీ వ్యవహారాల  సలహాదారు సర్తాజ్ అజీజ్ శుక్రవారం ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ.. గవాడర్, టర్బాట్‌లో జరిగిన ఐఈడీ పేలుళ్లలో జాదవ్ హస్తముందన్నారు.

రాడార్ స్టేషన్, పౌరులు ప్రయాణిస్తున్న బోట్లపై దాడి ఘటనలోనూ ఆయన ప్రమేయం ఉందని  ఆరోపించారు. బలూచిస్థాన్‌  సిబీ, సుయ్ ప్రాంతాల్లో జరిగిన గ్యాస్ పైప్‌లైన్,  ఎలక్ట్రిక్ పైలాన్ల పేలుళ్ల సూత్రధారి జాదవేనని పేర్కొన్నారు. 2015లో క్వెట్టాలో జరిగిన బాంబు దాడిలో భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగాయని, బలూచ్ ప్రేరేపిత ఉగ్రదాడి అయిన దీని సూత్రధారి జాదవేనని ఆరోపించారు. జాదవ్‌పై ఇంకా  పలు కేసులు ఉన్నాయని అజీజ్ పేర్కొన్నారు.

అమాయకుడైన వ్యక్తి వద్ద హిందూ పేరుతో ఒకటి, ముస్లిం పేరుతో మరొకటి చొప్పున రెండు పాస్‌పోర్టులు ఎందుకు ఉన్నాయని అజీజ్ ప్రశ్నించారు. జాదవ్ విషయంలో భారత్ అనవసర ప్రచారం కోసం పాకులాడుతోందని అజీజ్ ఆరోపించారు. సమస్య పరిష్కారం విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు సర్తాజ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News