: విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతున్న లగడపాటి!
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయంలోని చంద్రబాబు కార్యాలయంలో వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై లగడపాటి ప్రశంసలు కురిపించారు. తాత్కాలిక సచివాలయమే ఇంత అద్భుతంగా ఉంటే... శాశ్వత భవనాలు ఇంకెంత అద్బుతంగా ఉంటాయో అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, చంద్రబాబుతో లగడపాటి భేటీ విజయవాడ రాజకీయాల్లో వేడిని పెంచింది. ఓవైపు కేశినేని నాని వ్యవహారశైలిపై చంద్రబాబు అసహనంగా ఉన్న సమయంలో ఆయనను లగడపాటి కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ భవిష్యత్తు కోసం కేశినేని ట్రావెల్స్ ను కూడా కేశినేని నాని మూసి వేశారు. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పట్ల కేశినేని నాని ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు... ఆయనను దూరం పెట్టే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో కేశినేని నానిని పక్కన పెట్టి, లగడపాటికి చంద్రబాబు ఎంపీ టికెట్ ఇస్తారా? అనే కోణంలో బెజవాడ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ విజయవాడలో నెలకొంది.