: 'దీప పేరవై' పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. దాడులకు దిగిన దీప, ఆమె భర్త మాధవన్ వర్గాలు


జయలలిత వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన దీప, ఆమె భర్త మాధవన్ వర్గాల మధ్య విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. సొంతంగా ‘ఎంజీఆర్ అమ్మ పేరవై’ని స్థాపించిన దగ్గరి నుంచి భర్త మాధవన్‌తో దీపకు మనస్పర్థలు వచ్చాయి. దీప పేరవైలో తాను చెప్పిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదన్న కారణంగా మాధవన్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ కలిశారు. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నిక  సందర్భంగా నామినేషన్ పత్రాల్లో భర్త కాలమ్‌ను ఖాళీగా పెట్టడం మాధవన్‌ను మరోమారు ఆగ్రహానికి గురిచేసింది.

కాగా, శుక్రవారం దీప ఇంటి ముందు నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో దీప, మాధవన్ దంపతుల మధ్య మరోమారు విభేదాలు పొడసూపాయి. అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచె కట్టుకున్న మాధవన్ అనుచరులతో కలిసి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. దీప కోసం ఇంటి బయట వేచి చూసిన అనంతరం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో ఆయన అనుచరులు దీప వర్గంతో వాగ్వాదానికి దిగారు. ఘర్షణ మరింత ముదరడంతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. పరస్పరం మంచినీళ్ల బాటిళ్లు, రాళ్లు విసురుకున్నారు. దీప డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపించాయి. గొడవ వద్దని దీప కేకలు పెట్టినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అక్కడి నుంచి  పంపించివేశారు.

  • Loading...

More Telugu News