: మంచి వాడిని దొంగ అన్నారు.. తప్పు చేయడం నా డీఎన్ఏలోనే లేదు: కేశినేని నాని


మంచి వాడిని దొంగ అన్నారని, ఇది సమాజానికి మంచిది కాదని, తప్పు చేయడం తన డీఎన్ఏలో లేదని టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత నాని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో తమ ట్రావెల్స్ బస్సులను తిప్పబోమని, ఆర్డీసీలో అసలే తిప్పనని ఆయన కరాఖండిగా చెప్పారు. ఈ వ్యవస్థను బాగు చేసే సత్తా తనకు లేకనే, ట్రావెల్స్ నిర్వహణ నుంచి తప్పుకున్నట్టు చెప్పారు. వ్యాపారంలో తానెప్పుడూ తప్పు చేయలేదని, మనస్సాక్షితో పని చేశానని చెప్పారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే ఇరవై రాష్ట్రాలు ఉన్నాయని, అక్కడ తనకు రెడ్ కార్పెట్ పరుస్తారని అన్నారు. నిబంధనల మేరకే బస్సులు తిప్పానని, తాను దొంగ బస్సులు ఎప్పుడూ తిప్పలేదని, అయినా, కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేశాయని అన్నారు.

 ‘కొన్ని కారణాల వల్ల బస్సుల వ్యాపారం ఆపేయాలని అనుకున్నాను..ఆపేశాను. నేను పుట్టింది..పెరిగింది బస్సుల్లో. కావాలంటే, ఆ బస్సులను రోజూ శుభ్రంగా కడిగించుకుంటా..వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తా తప్పా, ఈ రెండు రాష్ట్రాల్లో నా బస్సే తిప్పను. నా బస్సు.. సేఫెస్టు బస్సు ట్రావెల్ ఇన్ ది కంట్రీ. దేశ వ్యాప్తంగా యాక్సిడెంట్ల లెక్కలు చూస్తే.. మా బస్సులకు యాక్సిడెంట్స్ పెద్దగా జరగలేదనే చెప్పవచ్చు. నేను తప్పు చేసినట్టయితే ఈ పాటికి నా వద్ద లక్ష బస్సులు ఉండేవి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొవ్వొత్తిలా కరుగుతూ వచ్చానే తప్పా..పెరగలేదు. రెండేళ్ల నుంచి నా ట్రావెల్స్ కు నష్టాలు వస్తున్న మాట వాస్తవమే. మార్కెట్లో కొన్ని అనుమతి లేని బస్సులు తిరుగుతుండటం వల్లే ఈ నష్టాలు వస్తున్నాయి. ఇటువంటి నష్టాలను తట్టుకుని ఇంకా పదేళ్లు నిలబడగల కెపాసిటి కేశినేని నానికి, ట్రావెల్స్ కూ ఉంది... ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను బస్సుల వ్యాపారం చేయను’ అని నాని తెగేసి చెప్పారు.

  • Loading...

More Telugu News